ఇంజన్ లేని రైలు.. తిరిగింది లక్ష కిలోమీటర్లు!

భారత తొలి ఇంజిన్‌ రహిత సెమీ హై స్పీడ్‌ రైలు ఎక్కడా ఒక్క చోట కూడా ఆగిపోకుండా లక్ష కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేసింది. వన్డే భారత్ ఎక్స్‌ప్రెస్‌గా పిలుస్తున్న ఈ రైలు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. దీనిని ఈ ఏడాది ఫిబ్రవరి 15న ప్రధాని మోదీ ప్రారంభించారు. దిల్లీ నుంచి వారణాసి మధ్య మూడు నెలల నుంచి వినియోగంలో ఉన్న రైలు ఒక్క ట్రిప్పు కూడా ఆగిపోకుండా, బుధవారంతో లక్ష కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు రైల్వే సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. ప్రారంభించిన మొదటి రోజు మాత్రం కాన్పూర్‌ వద్ద రైలుకు చిన్న బ్రేక్‌ డౌన్‌ అయిందని, అప్పటి నుంచి ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదని వివరించారు. రైలును ఫిబ్రవరి 15న రైలు ప్రారంభించగా, అదే నెల 17 నుంచి ప్రయాణికులను అనుమతించారు. శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌ల స్థానంలో త్వరలోనే ఈ రైళ్లను ప్రవేశపెట్టనున్నారు.

ఈ సెమీ హైస్పీడ్‌ రైలును చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ కర్మాగారంలో కేవలం 18 నెలల్లో, రూ.97 కోట్లతో తయారు చేశారు. 180 డిగ్రీల కోణంలో తిరగగలిగేలా సీట్లు, వేగవంతమైన వైఫై, ప్రతి కోచ్‌లో సీసీ కెమెరాలు, బయో వాక్యూమ్‌ శౌచాలయాలు, వాటంతట అవే తెరుచుకొనే తలుపులు, ఏసీ వంటివి ఈ రైలు ప్రత్యేకతలు. అంతేకాక అత్యవసర సమయంలో డ్రైవర్‌తో మాట్లాడే వెసులుబాటు ప్రతి కోచ్‌లోనూ ఏర్పాటు చేశారు. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ గంటకు కనిష్ఠంగా 160 కిలోమీటర్లు, గరిష్ఠంగా 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Notice: Undefined index: cookies in /home/content/n3pewpnaspod02_data06/42/42274742/html/wp-content/plugins/live-composer-page-builder/modules/tp-comments-form/module.php on line 1638

andhrasamacharam