వైఎస్సార్ తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. పేరు అనే కంటే ఓక బ్రాండ్ అనడమే సరైనది. పేద ప్రజల ఆరాధ్యుడిగా.. రాజకీయాల్లో ప్రత్యేక వ్యక్తిగా.. వ్యక్తిత్వంలో మడమ తిప్పని యోధుడిగా.. వైఎస్సార్ ఇమేజి గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రజలకి చెప్పక్కర్లేదు. అదే విధంగా సినిమాల్లో బయోపిక్ లు కూడా ప్రత్యేక తరహా ఇమేజితో ఉండేవే! జీవిత చారిత్రలను వెండితెరమీద ఆవిష్కరించి ప్రేక్షకులను అలరించినవి కొన్ని.. ఆలోచింపచేసినవి మరికొన్ని కొన్ని.. ఆదర్శప్రాయంగా నిలిచినవి ఇంకొన్ని.. కంటతడిపెట్టించినవీ ఉన్నాయి. అయితే రాజకీయ నాయకుల జీవిత చరిత్రలు చాలా తక్కువ. అవి కూడా ఆయా నాయకుల పుట్టుపూర్వోత్తరాలు చర్చించినవే. కానీ, ఓకే ప్రజా నాయకుడి ప్రస్థానంలో కీలక ఘట్టాన్ని ఆధారంగా చేసుకుని.. దాని చుట్టూ కథని అల్లుకుంటూ.. భావోద్వేగాలను పండించి.. ప్రేక్షకుల మెప్పు పొందాలని చేసిన ప్రయత్నం యాత్ర!

ఇది దివంగత నేత జీవితం గురించిన సినిమా కాదు. ఆయన వేసిన అడుగుల్లో ప్రతిఫలించిన జన స్పందన. వైఎస్సార్ రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పిన ప్రస్థానం. తెలుగు రాజకీయాల్లో కొత్త చరిత్రని లిఖించిన చరిత్ర పుట.. దీని ఆధారంగా దర్శకుడు అద్భుతమైన వెండితెర సృష్టి చేశాడు. సినిమాలో కథ గురించి మాట్లాడుకోవడానికి, తెలుసుకోవడానికి ఏమి లేదు. ఎందుకంటే ఇదంతా అందరికీ తెలిసిన పాఠమే. అయితే, రాజశేఖర్ రెడ్డి అనే ఓ నాయకుడు ప్రజలతో మమేకమై వారి మధ్యలో తిరిగి తెలుసుకున్నదేమిటి? తాను తెలుసుకున్న వాస్తవ జన జీవితం నుంచి నేర్చుకున్నదేమిటి? అధికారంలోకి వచ్చాకా తాను చూసిన ప్రజా వ్యధలను పారద్రోలటానికి తీసుకున్న నిర్ణయాలేమిటి? వాటిని అమలు చేయడంలో ఆయన ఎదురున్న సంఘర్షణ నుంచి ఎలా బయటపడి విజయవంతంగా ముందుకు సాగారు ఇవన్నీ చక్కగా.. ఇంకా చెప్పాలంటే చిక్కగా.. ప్రేక్షకులకు అందించడంలో సినిమా యూనిట్ విజయవంతం అయింది.

మహి వి.రాఘవ దర్శకత్వం ఓక ప్రత్యేకమైన శైలిలో కనబడింది. ఊరికెనే జీవిత చరిత్ర అంటూ లెక్కలేని సన్నివేశాల్ని పోగేసి పడేయకుండా.. తీసుకున్న ఈవెంట్ పరిధిలోనే సినిమాని నడిపించాడు. కొన్ని చోట్ల సాగదీత కనిపించినా తప్పనిసరి అని ప్రేక్షకులు భ్రమించేలా చేయగలిగాడు. వైఎస్సార్ ని తానెంత అభిమానిస్తాడో ఆ పాత్ర మాటలతోనే చెప్పించాడు. కొన్ని అతిశయోక్తులూ సినిమాలో లేకపోలేదు. సినిసహజమైన అతిగా భావిస్తే అది పెద్ద విషయంగా కనిపించకపోవచ్చు. దర్శకుడు ఎంత ప్రాణం పెట్టి సినిమా ని చేశాడో అంతకంటే ఎక్కువ ఫలితం తీసుకువచ్చింది మాత్రం స్క్రీన్ ప్లే, మాటలు. రాజశేఖర్ పి .వి. అందించిన మాటల మూటలు చాలా బాగున్నాయి. చిన్న చిన్న వాక్యాలతో పెద్ద ఫలితాన్ని రాబట్టాడు. ఇక సినిమా ఎడిటింగ్, సంగీతం, నేపధ్య సంగీతం అన్నీ సరిగ్గా కుదిరాయి.

ముమ్ముట్టి ఈ సినిమాకు పెద్ద ఎసెట్. వైఎస్సార్ లా కనిపించే విధంగా లేకపోయినా.. ఆ పాత్రని సరిగ్గా అర్థం చేసుకుని.. పాత్రకు తగ్గ అభినయంతో సినిమాని మరోమెట్టు ఎక్కించాడు. ఒకరకంగా ముమ్ముట్టి పరకాయ ప్రవేశం చేశారనే చెప్పాలి. ఇక మిగిలిన పాత్రల్లో చేసిన వారందరూ చక్కగా చేశారు. అందరివీ దాదాపుగా కొద్దిసేపు కనిపించే పాత్రలే!

చివరగా.. రాజకీయ కోణంలో సినిమా చూసే వారిని కూడా ఆకట్టుకునేలా సినిమా ఉంది. సాధారణ ప్రేక్షకులకు మాత్రం భావోద్వేగాలకు లోను చేస్తుంది. మొత్తమ్మీద ఎన్నికల సీజన్ కు ఇది రాజశేఖరుడి మరో ప్రస్థానంలా ఉందనడంలో సందేహం అక్కరలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Notice: Undefined index: cookies in /home/content/n3pewpnaspod02_data06/42/42274742/html/wp-content/plugins/live-composer-page-builder/modules/tp-comments-form/module.php on line 1638

andhrasamacharam