7న బందరు పోర్టు పనులను ప్రారంభించనున్న చంద్రబాబు-ముడా చైర్మన్

విజయవాడ:ఈ నెల 7న బందరు పోర్టు నిర్మాణ పనులను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని ముడా(మచిలీపట్నం అర్బన్ డెవలెప్మెంట్ ఆఫ్ అథారిటీ) చైర్మన్ బూరగడ్డ వేదవ్యాస్ అన్నారు.ఈ సందర్భముగా ఓ హోటల్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బంద‌రు ప్ర‌జ‌ల‌కు చంద్ర‌బాబు మ‌రో వ‌రం అందించారన్నారు. కొన్నేళ్లుగా క‌ల‌గానే మిగిలిపోయిన బందరు పోర్టు నిర్మాణానికి ముఖ్య‌మంత్రి గ్రీన్ సిగ్న్లల్ ఇచ్చారన్నారు. అత్యాధునిక హంగులతో, అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో మచిలీపట్నం పోర్టు రూపుదిద్దుకోనుందన్నారు. చెన్నై- విశాఖ పట్నం పోర్టులను మించేలా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచ పోర్టుల నిర్మాణ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా బ్రేక్‌వాటర్‌ విధానంలో ఈ పోర్టును నిర్మించనున్నారన్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలతో పలు మధ్య భారత రాష్ట్రాలకు కూడా అతి దగ్గరి ఓడరేవు కావటంతో ప్రస్తుత, భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని భారీ స్థాయిలో ఈ పోర్టు నిర్మాణానికి నిధులు వెచ్చిస్తున్నారన్నారు.. రోడ్డు, ఇతర మౌలిక సదుపాయాలతో కాకుండానే రూ.11,924కోట్లను ఈ బందరు పోర్టు కోసం ఖర్చుచేయనుండగా.. తొలి దశలో రూ. 6,778 కోట్లను వెచ్చించనున్నామన్నారు. నిర్మాణ రంగంలో అందెవేసిన చేయిగా ఉన్న, పోల‌వ‌రం ప‌నుల‌ను శ‌ర‌వేగంగా పూర్తి చేస్తున్న‌ నవయుగ సంస్థ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు సూచనల మేరకు బందరు పోర్టును నిర్మించి, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చబోతోందన్నారు. ప్రతిష్ఠాత్మక బందరు పోర్టు పనులను సీఎం ఏడవ తేదీన బందరు వచ్చి మిషనరీతో పనులు ప్రారంభించి, మేకావారిపాలెం వద్ద పైలాన్‌ను ఆవిష్కరిస్తారన్నారు.
మచిలీపట్నంలో నిర్మించేది డీప్‌ వాటర్‌ పోర్టు కావటంతో ఇక్కడ బ్రేక్‌వాటర్‌ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారన్నారు. ఉవ్వెత్తున ఎగిసిపడే అలలు, ఆ అలలు తీసుకొచ్చే మట్టి, ఇసుకను అడ్డుకుని, తీరాన్ని ప్రశాంతంగా ఉంచేందుకు వీలుగా డయాఫ్రంవాల్‌ను నిర్మించనున్నారన్నారు. పోర్టు నిర్మించే ప్రాంతం ప్రకృతి విపత్తుల బారిన పడకుండా పెద్ద రాతి కట్టడాన్ని నిర్మించనున్నామన్నారు. సముద్రం లోపల, తీరం వెంబడి 18 నుంచి 20మీటర్ల లోతులో ఫైల్స్‌ నిర్మించనున్నామన్నారు. ముందుగా సముద్రతీరానికి దక్షిణంవైపున రాళ్లు, మట్టితో కూడిన కట్టడాన్ని నిర్మించి, అది పూర్తైన వెంటనే స్ట్రక్ఛరల్‌ నిర్మాణాన్ని చేపట్టనున్నామన్నారు. ముందుగా వర్టికల్‌ ఫైల్స్‌ నిర్మించి, దాంతోపాటు రేకర్‌ ఫైల్స్‌ను కట్టనున్నారు. వీటన్నింటికీ ఇంటర్‌లాకింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటుచేసి, పటిష్ఠ నిర్మాణం చేపట్టనున్నామన్నారు. మొత్తం ఈ బ్రేక్‌ వాటర్‌ (అడ్డుకట్ట) నిర్మాణానికి దాదాపు 136 వారాలు పట్టే అవకాశం ఉందన్నారు. పోర్టు నిర్మాణం కోసం డ్రెడ్జింగ్‌ చేయాల్సి ఉందని,దీంతో మొదటి దశలో సముద్ర తీరం, సుముద్రం లోపల కలిపి మొత్తం 68 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్లను డ్రెడ్జింగ్‌ ద్వారా తొలగించాల్సి ఉంటుందనేది ఒక అంచనా అన్నారు. సముద్ర తీరం నుంచి భూమి వైపునకు మొత్తం 27 మిలియన్ల క్యూబిక్‌ మీటర్లను, తీరం నుంచి సముద్రం లోపలకు 41 మిలియన్ల క్యూబిక్‌ మీటర్లను డ్రెడ్జింగ్‌ చేయాల్సి ఉంటుందన్నారు. సముద్రం లోపలకు దాదాపు 20 కిలోమీటర్ల మేర ఈ డ్రెడ్జింగ్‌ చేయాల్సి ఉంటుందన్నారు. సముద్ర తీరం నుంచి భూమివైపుగా డ్రెడ్జింగ్‌ చేయాల్సిన దానిలో దాదాపు తొమ్మిది మిలియన్ల క్యూబిక్‌ మీటర్లను ఎక్స్‌కవేటర్స్‌తో తీయనున్నామన్నారు. సముద్ర తీరం నుంచి లోపల వైపు ట్రైలర్‌ సక్షన్‌ హూపర్‌ డ్రెడ్జర్స్‌ (టీఎస్‌హెచ్‌డీ)తో తవ్వనున్నామన్నారు. నైరుతి రుతుపవనాలు, వాటి ప్రభావంవల్ల వర్షాలు వచ్చే మూడు నాలుగు నెలలు మినహా, మిగిలిన తొమ్మిది నెలలపాటు డ్రెడ్జింగ్‌ను చేపట్టనున్నామన్నారు.మొత్తం నాలుగు టీఎస్‌హెచ్‌డీలతో మెరైన్‌ డ్రెడ్జింగ్‌ చేపడతారన్నారు. నెలకు 25 రోజులపాటు నిరాటంకంగా ఈ పనులను నిర్వహిస్తారన్నారు. మచిలీపట్నం పోర్టును రెండు దశల్లో అభివృద్ధి పరిచేందుకు ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు. ఈ రెండు ఫేజ్‌లకు కలిపి మొత్తం రూ.11,924 కోట్లు ఖర్చు అవుతుందని అంచనాలు రూపొందించామన్నారు. మొదటి దశలో రూ.6,778 కోట్లు కాగా, రెండవ దశలో రూ.5146 కోట్లను వెచ్చించనున్నారు. మొదటి దశలో ప్రాజెక్టు ప్రిలిమ్‌నరీస్‌ అండ్‌ సైట్‌కు రూ.57 కోట్లు, డ్రెడ్జింగ్‌కు రూ. 1564కోట్లు, బ్రేక్‌వాటర్‌కు రూ.817 కోట్లు, బెర్తులకు రూ.1674 కోట్లు, స్టాక్‌యార్డ్‌ అభివృద్ధికి రూ.275 కోట్లు, యంత్ర పరికరాలకు రూ.151 కోట్లు, విద్యుదీకరణకు, పరికరాలకు రూ.87 కోట్లు, అంతర్గత రహదారులు, రైల్వే లైన్లకు రూ.172 కోట్లు, బాహ్య రైల్వే లైన్‌కు రూ.30 కోట్లు, ఇతర ఖర్చులకు రూ.237కోట్లు, సర్వీస్‌ ట్యాక్స్‌ (5.60శాతం)కు రూ.354 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

andhrasamacharam