ఆంధ్రా రాజకీయాల్లో ఆలీ ”హంగామా”

( ఆంద్ర సమాచారమ్ ప్రత్యేకం )
ఆలీ.. ఇపుడు ఆంధ్ర రాజకీయ వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. సినిమాల్లో తనదైన శైలిలో నవ్వించే ఆలీ ఇప్పుడు రాజకీయాల్లో సస్పెన్స్ కు వేదికగా మారారు. కొన్ని రోజులుగా ఆలీ వైసిపిలో చేరుతారనే ప్రచారం ముమ్మరంగా జరిగింది. ఎయిర్ పోర్టులో జగన్ ను కలవడం.. కొద్దిసేపు ముచ్చటించడం తో ఆలీ ఈ  నెల తొమ్మిదో తేదీన వైసిపిలో చేరనున్నారని వార్తలు వచ్చాయి. అటు ఆలీ కూడా ఈ  వార్తల్ని ఖండించలేదు. దీనితో.. అలీ రాజకీయ రంగప్రవేశం వైసీపీతో ఖాయమనే భావించారందరూ.
ఇపుడు ఆదివారం మరోట్విస్ట్ కు తెరలేపారు ఆలీ. ఉదయాన్నే పవన్ కళ్యాణ్ తో దాదాపు రెండు గంటలు భేటీ అయ్యారు. దీనితో పొలిటికల్ వర్గాల్లో మళ్ళీ కొత్త చర్చ మొదలైంది. ఆలీ వైసిపి లో చేరబోవడం లేదని.. జనసేనతో కల్సి నడవనున్నారనీ చెప్పుకుంటున్నారు. పవన్ తో ఆలీ కి చాలా సంవత్సరాలుగా స్నేహ బంధం ఉందనేది అందరికి తెలిసిన విషయమే. పవన్ సినీ రంగంలో అత్యంత సన్నిహితంగా ఉండే వారిలో ఆలీని  ప్రముఖంగా చెప్పుకోవచ్చు. అటువంటిది ఆలీ వైసిపిలో ఎలా చేరుతారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. జగన్ ను ఆలీ మర్యాదపూర్వకంగానే కల్సి ఉంటారని వారి వాదన.
అయితే, వైసిపిలో తాను చేరనున్నట్టు పవన్ కు వివరించడానికే ఆదివారం ఆయనను ఆలీ కలిశారని తెలుస్తోంది. తానూ వైసిపిలో చేరడానికి కారణాలను మిత్రుడు పవన్ కు మర్యాద పూర్వకంగా వివరించినట్టు చెప్పుకుంటున్నారు. దీనికి పవన్ కూడా సానుకూలంగానే స్పందించారని అంటున్నారు. స్నేహం వేరు, రాజకీయం వేరని ఆలీకి పవన్ చెప్పినట్టు చెబుతున్నారు. ఆలీ ఏ పార్టీలో ఉన్నా తనకు ఇబ్బంది లేదని అన్నట్టు సమాచారం.
ఇపుడు ఆలీ రాజకీయ ఆరంగేట్రం ఎలా జరుగుతుందనేది 9వ్ తేదీన తేలిపోతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

కొసమెరుపేమిటంటే.. ఆలీ జనసేన నాయకుడు పవన్ ను కల్సిన తరువాత.. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. దాదాపు అరగంట పాటు ఆయనతో ఏకాంతంగా భేటీ అయ్యారు. రెండు చోట్ల నుంచి మీడియాతో మాట్లాడకుండానే ఆలీ వెళ్లిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

andhrasamacharam